»Mp Raghu Rama Krishna Raju Ysp Earned Money By Cutting Off Womens Mangali Sutram
MP Raghu Rama Krishna Raju: మహిళల తాళిబొట్లు తెంచి వైసీపీ డబ్బు సంపాదించింది!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళలను దోచుకుంటోందని, వాళ్ల తాళిబొట్లను తెంచి డబ్బు సంపాదించిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
MP Raghu Rama Krishna Raju: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కో మహిళ నుంచి జగన్ రూ.1.15 లక్షలు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో తక్కువ రేటుకే నాణ్యమైన మద్యం దొరికేదని, కానీ వైసీపీ పాలనలో మద్యం రేటు ఆకాశాన్ని తాకాయన్నారు. ఏపీలో ప్రస్తుతం నాణ్యమైన మద్యం దొరకట్లేదని అన్నారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత అంటూ మహిళలకు జగన్ డబ్బులు వేస్తున్నారు కానీ తిరిగి ఆ డబ్బును మద్యం రూపంలో తీసుకుంటున్నారని అన్నారు.
మహిళల భర్తలు రోజూ మద్యం తాగుతున్నారని, ఇలా వాళ్ల భర్తలు ప్రభుత్వానికి రోజుకి రూ.140 కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. రోజుకి రూ.140 అంటే ఏడాదికి రూ.50,400 ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి జగన్ ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇప్పిస్తాడన్నారు. ఓటు కోసం వైసీపీ ఎంతైనా ఖర్చు పెడుతుందని, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి.. కానీ వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దని కృష్ణంరాజు ఓటర్లను కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎందరో మహిళల తాళిబొట్లను తెంచి డబ్బు సంపాదించిందని ఆరోపించారు. అలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేసిందని, ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా? లేదా? చెక్ చేసుకోవాలని కృష్ణంరాజు తెలిపారు.