»Central Bureau Of Investigation Has Again Attacked Cyber Criminals
CBI: సైబర్ నేరగాళ్లపై సీబీఐ ఆకస్మిక దాడులు
సైబర్ నేరగాళ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరోసారి దాడులు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని లక్ష్యంగా చేసుకుని జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో 11 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
CBI: సైబర్ నేరగాళ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరోసారి దాడులు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని లక్ష్యంగా చేసుకుని జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో 11 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్థిక మోసాలకు సంబంధించి ఐదు వేర్వేరు కేసులు నమోదు చేసిన సీబీఐ.. ఆపరేషన్ ‘చక్ర-2’ పేరుతో దాడులు నిర్వహించింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) అందించిన సమాచారం ఆధారంగా క్రిప్టో కరెన్సీ స్కామ్‌లతో కూడిన సుమారు రూ.100 కోట్ల మోసానికి సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. కొందరు విదేశీయులు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి టెక్నికల్ సపోర్టు సిబ్బందిగా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది.
ఎఫ్ఐయూ, ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ తదితర అంతర్జాతీయ విభాగాల నుంచి అందిన సమాచారం ఆధారంగానే ఆపరేషన్ చక్ర-2ను చేపట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. తాజా సెర్చ్‌లో తొమ్మిది కాల్ సెంటర్లను సెర్చ్ చేశారు. ఆపరేషన్ కొనసాగుతున్నందున, మిగిలిన రెండు కేసుల గురించి సమాచారం వెల్లడించలేదు. ఇదిలావుంటే, సైబర్ నేరగాళ్లే లక్ష్యంగా గతేడాది ‘ఆపరేషన్ చక్ర’ పేరుతో దేశవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అప్పట్లో ఒక్క రాజస్థాన్ లోనే రూ.1.5 కోట్ల నగదు, అర కిలో బంగారం పట్టుబడింది.