జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఐదో విడదతను చేపట్టనున్నారు. ఈసారి యాత్రలో రైతు సమస్యల పరిష్కారం దిశగా పోరాటం సాగించనున్నారు. అలాగే సీఎం జగన్ టార్గెట్‌గా పవన్ ముందుకెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఎక్కువయ్యింది. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) స్కిల్ స్కామ్ కేసులో జైలులో ఉండటంతో ఈ ఎన్నికల్లో వైసీపీ (Ycp)ని ఢీకొనేందుకు టీడీపీ, జనసేన (Janasena) రెండూ కలిసి పోరాడుతున్నాయి. తాజాగా రాజకీయ పరిస్థితులు మారాయి. చంద్రబాబుపై వరుస కేసులు నమోదవుతుండటంతో జనసేన కాస్త పక్కకు జరిగినట్లు అనిపిస్తోంది. ఉమ్మడిగా పోరాటం చేస్తామంటూనే సింగిల్ గానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టాడు.
నాలుగో విడత వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్నప్పుడు పవన్ కాస్త ఇబ్బంది పడ్డాడు. తీవ్ర నడుం నొప్పి కారణంలో ఆయన మధ్యలోనే వెళ్లిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మచిలీపట్నం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఆయన మధ్యలోనే వెళ్లిపోయాడు. ఆ తర్వాత వైరల్ ఫీవర్‌తో హైదరాబాద్ చేరుకుని అక్కడే చికిత్స తీసుకున్నారు.
తాజాగా ఐదో విడత వారాహి యాత్రను చేపట్టేందుకు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి సమావేశం అయ్యారు. ఈ సారి రైతు సమస్యలపైనే పోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలతో పాటు వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను చాటిచెప్పేందుకు పవన్ సిద్ధమయ్యారు.
నాలుగో విడత వారాహి విజయయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరులో పవన్ పర్యటించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఐదో విడత వారాహి విజయ యాత్రను ఈసారి కృష్ణా జిల్లా నుంచే ప్రారంభించాలని జనసేన నేతలకు పవన్ తెలిపినట్లు సమాచారం. అయితే గుంటూరులో కూడా ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి సీఎం జగన్ టార్గెట్‌గా పవన్ ముందుకెళ్తారని జనసేన నేతలు చర్చించుకుంటున్నారు.