బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన హామీలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని.. రాష్ట్ర రెవిన్యూలో 20 శాతం వడ్డీలకే పోతుందన్నారు.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పలు హామీలను కొత్తగా ప్రకటించారు. అయితే ఈ హామీలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మోద్దని కోరారు. కేసీఆర్ తడిగుడ్డతో గొంతు కోసే రకమని అన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..ఏరు దాటిన దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా చేస్తాడని పేర్కొన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్(BRS) పార్టీ అనేక హామీలను అమలు చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి, రైతులకు ఉచిత ఎరువులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, రైతులకు రుణమాఫీ సహా అనేకం ప్రకటించి అమలుచేయలేదన్నారు. ఇలా మరోసారి కేసీఆర్ ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నాడని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదన్నారు. అమలుకు నోచుకోలేని హామీలు ఇప్పటికే అనేకం ప్రకటించాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిత్తశుద్ధి లేని హామీలు ఎందుకని ప్రశ్నించారు. ఇవన్నీ నీటి మూటలే తప్ప వాటిలో నిజం లేదన్నారు.
నీ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రభుత్వ సంపద పెరిగిందా అంటూ కిషన్ రెడ్డి కేసీఆర్(KCR)ను ప్రశ్నించారు. కానీ అప్పులు, అవినీతిని రాష్ట్రంలో పెంచి పోషించారని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణ సంపదను మీరు మీ ఫ్యామిలీ దోచుకున్నారని.. వరస్ట్ ఎకామికల్ పాలసీని అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు 45 వేల కోట్ల అప్పులతో కులిపోయే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు కేసీఆర్ రాష్ట్రంలో బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసీ అమలు చేస్తున్నాడని ఆరోపించారు. దీంతోపాటు బెస్ట్ ఇరిగేషన్ కమిషన్ పాలసీని కూడా వాడుకుంటున్నారని అన్నారు. ఇక దళిత బంధు పాలసీని ఈ రకంగా అమలు చేస్తూ పోతే ఇంకో 50 ఏళ్లు పడుతుందని అన్నారు. ఇప్పటికే కేసీఆర్(KCR) అనేక హామీలు ప్రకటించి వాటిని అమలు చేయకుండా ఇప్పుడు కొత్త హామీలు ప్రకటిస్తున్నాడని, ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే అవకాశం లేదన్నారు.