World Record: జీవితంలో ఒక్కోరికి ఒక్కో గోల్ ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన తనుశ్రీ కూడా ఇలాంటి కోవకి చెందినదే. ఛత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లా పురఈ గ్రామానికి చెందిన 9ఏళ్ల తనుశ్రీ నిర్విరామంగా 5గంటలు పాటు స్విమ్మింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. పురఈ గ్రామంలో ఉండే చెరువులో ఈది ఈమె గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. తనుశ్రీకి స్విమ్మింగ్ మీద ఉండే ఆసక్తితో స్విమ్మింగ్ అకాడమీలో చేరి శిక్షణ కూడా తీసుకుంది. అలా రోజూ 7 నుంచి 8 గంటలు ప్రాక్టీస్ చేసేంది. ఈక్రమంలో ఆమె ఆదివారం 5గంటలు పాటు చెరువులో ఈది వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
తనుశ్రీ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు గ్రామస్థులు అందరూ చెరువు దగ్గరకు వచ్చి ఆమెని ప్రోత్సహించారు. 9ఏళ్ల బాలిక 5గంటలు పాలు నిర్విరామంగా స్విమ్మింగ్ చేయడం సాధారణ విషయం కాదని ఆసియా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సభ్యుడు అలోక్ కుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అద్భుత ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డు ఇస్తారని కూడా ఆయన తెలిపారు. స్విమ్మింగ్ పూర్తయిన తర్వాత ఆమెకి వైద్యపరీక్షలు కూడా నిర్వహించారు. పురఈ అనే గ్రామం క్రీడలకు బాగా ప్రసిద్ధి చెందింది. తనుశ్రీ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 12గంటలు పాటు నిరంతరాయంగా స్విమ్మింగ్ చేయడమే తన లక్ష్యమని తనుశ్రీ అంటోంది.