»Rbis Key Announcement On Rs 2000 Notes Rs 12000 Crore Notes Not Yet Received
RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..ఇంకా అందని రూ.12,000 కోట్ల నోట్లు
రూ.2 వేల నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక విషయాన్ని వెల్లడించింది. బ్యాంకింగ్ ద్వారా తమకు 87 శాతం నోట్లు మాత్రమే అందాయని, ఇంకా రూ.12000 కోట్లు విలువైన నోట్లు రావాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు.
భారత ప్రధాని మోదీ (Pm Modi) ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోట్లను (2000 Notes) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోట్లను కూడా కేంద్రం, ఆర్బీఐ (RBI) ఉపసంహరించుకుంటున్నట్లుగా మే 19, 2023న ప్రకటించాయి. అయితే ప్రజల వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని ప్రకటిస్తూ కొంత గడువును కూడా ఆర్బీఐ ఇచ్చింది.
ప్రజల వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకులో జమ చేయడం, ఇతర డినామినేషన్ నోట్లుగా మార్చుకోవడం కోసం సెప్టెంబర్ 30వ తేది వరకూ గడువును ఇచ్చింది. అయితే గత నెలలో వరుస సెలవులు (Bank Holidays) కూడా ఉండటంతో ఆ గడువును అక్టోబర్ 7వ తేది వరకూ పొడిగిస్తూ ప్రకటన చేసింది. ఆ గడువు కూడా పూర్తవ్వడంతో ఆర్బీఐ మరో అవకాశాన్ని రూ.2 వేల నోట్లను కలిగి ఉన్న వారి కోసం ఇచ్చింది.
అక్టోబర్ 8వ తేది నుంచి ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో మాత్రమే ఆ నోట్లను మార్చుకునే వీలుంటుందని వెల్లడించింది. ఇప్పటి వరకూ 87 శాతం రూ.2వేల నోట్లు తమకు చేరాయని, అంటే రూ.3.43 లక్షల కోట్ల విలువైన నోట్లను తాము అందుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లుగా ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు. అయితే మిగతా 13 శాతానికి సమానమైన రూ.12000 కోట్ల విలులైన నోట్లు తమకు అందలేదని, అవన్నీ మార్కెట్లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. వెంటనే ఆ నోట్లను ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవాలని సూచించారు.