Vodafone Idea యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓటీటీ కూడా
టెలికామ్ సంస్థలు అన్ని తమ ప్యాకేజీలను యూజర్లకోసం అప్డేడ్ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే పనిలో భాగంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లను అందిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ ఐడీయా కూడా ఇదే తరహా ప్లాన్‌ను అందిస్తోంది.
Vodafone Idea: ఇప్పుడు ట్రెండ్ మారింది. టెలికాం కంపెనీలు కొత్త ప్లాన్స్ తీసుకొస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించడానికి రిలియాన్స్ బ్రాడ్ బాండ్ అందించిన ఐడియాను ఇప్పుడు టెలికాం రంగాలు అవలంభిస్తున్నాయి. తాజాగా ఇదే వరుసలో వొడాఫోన్ ఐడియా చేరింది. తమ యూజర్లకు నచ్చిన ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకునేందుకు వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) అవకాశం కల్పిస్తోంది. రీఛార్జి ప్లాన్ అనుగుణంగా వీఐ అందించే ఎంపికల్లో నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకొనే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇది కేవలం పోస్ట్ పెయిడ్ (postpaid) కస్టమర్లు మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా అందిస్తున్న వీఐ మ్యాక్స్ (Vi Max) పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రూ.401 నుంచి మొదలవుతున్నాయి. రూ.401 రీఛార్జితో 50జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 300 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. వీటితో పాటూ హంగామా మ్యూజిక్, వీఐ మూవీస్, వీఐ టీవీ, వీఐ గేమ్స్ కూడా లభిస్తాయి. తాజా స్కీమ్‌లో భాగంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్, సోనీ లివ్ మొబైల్ సబ్స్క్రిప్షన్, సన్ నెక్ట్స్ ప్రీమియం, ఈజ్‌మైట్రిప్ ద్వారా రిటర్న్ విమానాల బుకింగ్‌పై నెలకు రూ.750 తగ్గింపు లాంటి సదుపాయాలను అందిస్తుంది. ఏడాది పాటు వచ్చే ఈ ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని కస్టమర్లే ఎంపిక చేసుకోవచ్చు. వీఐ అందిస్తోన్న మ్యాక్స్ ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.501 రీఛార్జ్ చేసుకుంటే రెండు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, రూ.701తో రీఛార్జ్ చేసుకుంటే మూడు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు పొందవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కస్టమర్లు అయితే తన వద్ద ఉన్న డేటాను మరొకరితో పంచుకొనే సదుపాయాన్ని వీఐ అందిస్తున్న విషయం తెలిసిందే.