ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ రోజు (శుక్రవారం) చేపట్టింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్‌పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అధికారుల కేటాయింపునకు సంబంధించి ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్లపై రెగ్యులర్ బెంచ్ విచారణ చేస్తుందన్నారు. వ్యక్తిగతంగా వాదనలు వినిపిస్తామని అధికారుల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.
ఏపీ క్యాడర్‌కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నారు. వీరిలో తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు. ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ మొన్నటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. క్యాడర్ విషయంలో వారం కింద హైకోర్టు తీర్పునిచ్చింది. ఏ రాష్ట్ర క్యాడర్‌కు చెందినవారు ఆ రాష్ట్రంలోనే రిపోర్ట్ చేయాలని స్పష్టంచేసింది. దీంతో వెంటనే డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో సీఎస్ పోస్ట్ వదిలి ఆంధ్రప్రదేశ్‌లో సోమేశ్ కుమార్ రిపోర్ట్ చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు జారీచేయగా సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌గా కొనసాగారు. క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ 2017లో హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌పై వాదనలు జరిగాయి. సీజే జస్టిస్ భూయాన్ బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. టీఎస్ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. క్యాట్ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి కొనసాగింపును రద్దు చేసింది. దీంతో ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు. మరికొందరు అధికారులు క్యాడర్ కేటాయింపుపై హైకోర్టు మెట్లు ఎక్కారు.