Delhiకి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ఎందుకంటే.?
బీజేపీ హైకమాండ్ పిలుపుతో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. పసుపుబోర్డు ఏర్పాటు, గిరిజన వర్సిటీ.. ఇతర అంశాల గురించి కిషన్ రెడ్డితో అమిత్ షా మాట్లాడతారు. తర్వాత క్యాబినెట్ సమావేశంలో ఈ రెండు అంశాలు.. ఇతర అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
Kishan Reddy: తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. పాలమూరు, ఇందూరు సభల్లో ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. కీలక హామీలు ఇచ్చి.. సీఎం కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేశారు మోడీ. ఆ కామెంట్స్ వేడి ఇంకా చల్లారడం లేదు. ఇంతలో బీజేపీ హై కమాండ్ నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి (Kishan Reddy) పిలుపు వచ్చింది. వెంటనే హస్తిన రావాలనే సమచారంతో.. బయల్దేరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. బీజేపీ కూడా వడి వడిగా అడుగులు వేస్తోంది. మోడీ పర్యటన తర్వాత స్పీడ్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పలు అంశాలకు సంబంధించి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందని తెలుస్తోంది.
పసుపు బోర్డు ఏర్పాటు, గిరిజన వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ పరిధి పెంపుపై ప్రధాని మోడీ ప్రకటన చేశారు. ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయా..? విభజన హామీలు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోన్న అంశాలను కిషన్ రెడ్డిని అడిగి తెలుసుకోనున్నారు అమిత్ షా. ఇవేకాక కీలక అంశాలను కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్యాబినెట్ భేటీ కన్నా ముందే.. అమిత్ షాతో కిషన్ రెడ్డి సమావేశం అవుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాం.. సీట్లు పెరగడానికి చేయాల్సిన విధానాలపై చర్చించే అవకాశం ఉంది.
ఇందూరు సభలో మోడీ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని.. ఎన్డీయేలో చేరతామని అడిగారని గుర్తుచేశారు. తెలంగాణలో తన కుమారుడు కేటీఆర్కు పాలన పగ్గాలు అందించాలని అనుకుంటున్నానని.. ఆశీర్వదించాలని కోరారని తెలిపారు. ఇది రాచరికం కాదని.. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోం అని కేసీఆర్కు స్పష్టం చేశానని వివరించారు. ఆ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా భగ్గుమన్నాయి.