మహబూబ్‌నగర్ పర్యటలో ప్రధాని మోదీ (PMModi) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.నిజామాబాద్‌లో పసుపు బోర్డు (Turmeric Board) ను, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అనంతరం మహబూబ్‌నగర్ (Mahbubnagar) సమీపంలోని అమిస్తాపూర్ వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. తెలంగాణలో మార్పు భారతీయ జనతా పార్టీతో సాధ్యమని.. తమ పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధాని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ పార్టీలకు అవినీతి, కమీషన్లే సిద్ధాంతమని ఆయన విమర్శించారు. కుటుంబాల కోసమే ఆ పార్టీలు పనిచేస్తాయని.. వాటి నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని అన్నారు. సామాన్య ప్రజలనే బీజేపీ (BJP) కుటుంబంగా భావించి పాలన అందిస్తోందని చెప్పారు. తెలంగాణ(Telangana)లో ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని.. ఆ కంపెనీలో ఛైర్మన్, సీఈవో నుంచి మేనేజర్ వరకు అంతా కుటుంబ సభ్యులేనని ఎద్దేవా చేశారు. సహాయ సిబ్బందిగా మాత్రం ఇతరుల్ని నియమించుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా నీరు మాత్రం అందడం లేదన్నారు.
ములుగు జిల్లాలో నేషనల్ సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ (Tribal Varsity) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.900 కోట్లతో నిర్మించనున్న ఈ యూనివర్శిటీకి సమ్మక్క-సారక్క పేరు పెడుతున్నట్లు తెలిపారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) స్థాయిని పెంచుతున్నామని.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ మారనుందని తెలిపారు. కృష్ణపట్నం-పాలమూరు మధ్య మల్టీ పర్పస్ పెట్రో పైప్ లైన్ (Petro Pipe Line) ప్రాజెక్టును నిర్మిస్తున్నామని.. దీని ద్వారా యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి సౌకర్యాలు లభిస్తాయన్నారు. వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిని మోడీ జాతికి అంకితం చేశారు.