జీపీఎస్ సిగ్నల్స్ వల్ల 20 విమానాలు దారి తప్పిన ఘటన ఇరాన్లో చోటుచేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే ఈ 20 విమానాలు గగనతలంలో తమ దారిని తప్పి ఇబ్బంది పడినట్లుగా పైలెట్లు వెల్లడించారు.
కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఇప్పుడు అందరూ సాంకేతికత సాయాన్ని తీసుకుంటున్నారు. చేరాల్సిన గమ్యం కోసం జీపీఎస్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ జీపీఎస్ తప్పుగా చూపిస్తే అనేక ఇబ్బందులుంటాయి. కనిపించేవారిని అడ్రస్ అడుగుతూ వెళ్లాల్సిందే. రోడ్డుపై తిరిగే వాహనాలకు అయితే ఇలా చేయొచ్చు. అదే గాల్లో ప్రయాణించే విమానాలకు ఈ సమస్య వస్తే ఇక ఆ సమస్య వర్ణణాతీతంగా ఉంటుంది. జీపీఎస్ తప్పుడు సంకేతాలతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 విమానాలు గందరగోళానికి గురయ్యాయి. దారి తప్పిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.
20 విమానాలు జీపీఎస్ సిగ్నల్స్ తప్పుగా చూపడంతో దారితప్పిన ఘటన ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో కలకలం రేపింది. ఇరాన్ గగనతలం మీదుగా ఈమధ్య ప్రయాణించిన 20 విమానాలు జీపీఎస్ స్పూఫింగ్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. విమానాల్లో నేవిగేషన్ వ్యవస్థ అనేది కీలకంగా ఉంటుంది. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు కూడా ప్రతీక్షణం జీపీఎస్‌తో అది అనుసంధానమై పైలెట్లకు దారి చూపుతుంటుంది.
ఇరాన్లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని, ఫ్లైట్ నేవిగేషన్ వ్యవస్థకు తప్పుడు సంకేతాలను చూపిందని పైలెట్లు చెబుతున్నారు. దాడికి గురైన విమానాల్లో బోయింగ్ 777, 737, 747 సహా పలు ప్రైవేటు విమానాలు కూడా ఉన్నాయని ఏటీసీ అధికారులు తెలిపారు. అధికారుల సూచనలతో ఆ విమానాలకు ముప్పు తప్పిందని వెల్లడించారు. కేవలం 15 రోజుల్లోనే 20 విమానాలపై ఇలా దాడి జరగడంతో అధికారులు అప్రమత్తమై పలు చర్యలు తీసుకున్నారు.