కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్రరాజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైయస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తుందని వెల్లడించారు. ఏ పార్టీతోను పొత్తు ఉండదన్నారు. ఆ దిశగానే జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేసేలా జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నాయి. బీజేపీని కూడా కలుపుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కమలం పార్టీకి జనసేన ఓకే కానీ, టీడీపీతో కలిసేందుకు ఆసక్తిగా లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా వెళ్తుందా లేదా ఏం జరుగుతుందనేది చూడాలి. మరోవైపు కాంగ్రెస్ ఒంటరి పోరు అని చెబుతోంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ లేదా చతుర్ముఖ పోటీ ఉంటుంది. వైసీపీ, టీడీపీ-జనసేన మధ్య గట్టి పోటీ ఉండవచ్చు.