Mama Mashchindra: ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ రిలీజ్.. మామ, అల్లుళ్ల రివేంజ్!
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం డిఫరెంట్ టైటిల్‌తో మామా మశ్చీంద్ర అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. చివరగా ‘హంట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా.. థియేటర్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. ప్రస్తుతం ‘మామా మశ్చీంద్రా’ అనే వెరైటీ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుధీర్ సరసన ఈషా రెబ్బ, మిర్నలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా మూడు విభిన్న పాత్రలో కనిపిస్తున్నాడు. దుర్గా, డీజే, పరశురాం అనే క్యారెక్టర్స్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఆ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఓ పాత్రలో కాస్త లడ్డుబాబుగా కనిపించనున్నాడు సుధీర్ బాబు. తాజాగా మామా మశ్చీంద్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓ పాత్రలో సుధీర్ ఇద్దరు కూతుళ్లకు తండ్రిగా కనిపించాడు.
ఆయన కూతుళ్లు ఈషా, మిర్నలిని. ఈ ఇద్దరు.. సేమ్ తన తండ్రిలా ఉండే ఇద్దరు కవలలను ప్రేమిస్తారు. వాళ్లు ఎవరో కాదు.. తన చెల్లి కొడుకులు అని, ఇద్దరు ట్విన్స్ అని తెలుస్తుంది. కానీ తమ తల్లిదండ్రులను చంపిన మేనమామ మీద పగ తీర్చుకోకుండా.. మరదళ్లను పీకల్లోతు ప్రేమలో పడేస్తారు. మరి వారెందుకు అలా చేశారు.. మామా అసలు కథేంటి తెలియాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అక్టోబర్ 6న ఈ సినిమీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో సుధీర్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.