చెరువులో పడి ముగ్గురు మహిళలు, ఓ బాలుడు మృతిచెందిన సంఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని మనోహరాబాద్ మండలం, రంగాయపల్లిలో బాలుడితో సహా నలుగురు చెరువులో పడి తమ ప్రాణాలను కోల్పోయారు. వర్గల్ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన దొడ్డు బాలమణి(30), ఆమె కుమారుడు చరణ్(10) ఇద్దరూ రంగాయపల్లిలో జరిగే బోనాల పండుగకు వెళ్లారు.
సోమవారం మధ్యాహ్నం తమ బంధువులైన దొడ్డు లక్ష్మి(25), పిరంగి లావణ్య(25)తో కలిసి బాలమణి, చరణ్‌లు చెరువులో స్నానాలు చేయడానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు బాలుడు నీట మునిగాడు. ఈ క్రమంలో బాలుడ్ని కాపాడేందుకు తల్లి బాలమణి ప్రయత్నించింది. అయితే ఆమె కూడా నీట మునిగింది.
బాలుడితో పాటు తల్లిని రక్షించడానికి దొడ్డు లక్ష్మి, పిరంగి లావణ్యలు ప్రయత్నించారు. వారిద్దరినీ కాపాడే ప్రయత్నంలో వీరు కూడా నీట మునిగారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు మహిళలు, బాలుడు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలం వద్ద కుటుంబీకుల రోదనలు అందర్నీ కంటతడి పెట్టించాయి.