»Rape Of 5 Year Old Girl By 7 Year Old Boy Case Registered Under Pocso Act
Uttarpradesh: 5 ఏళ్ల బాలికపై 7 ఏళ్ల బాలుడి అత్యాచారం..పోక్సో చట్టం కింద కేసు నమోదు
సెల్ఫోన్ యుగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. అత్యాచార కేసులు ఇప్పటి వరకూ పెద్దవారిపై నమోదయ్యాయి. అయితే తాజాగా ఓ 7 ఏళ్ల బాలుడు 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఉత్తర్ప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు.. ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిందని తెలిపింది. ఆ సమయంలో అత్యాచార ఘటన జరిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఘటనపై బాలిక తల్లి తమ సమీపంలోని అక్బర్పూర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిల్లలిద్దరికీ జిల్లా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో అత్యాచారం జరిగినట్టు తేలింది.
ఈ నేపథ్యంలో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఐపీసీలోని సెక్షన్ 82 ప్రకారంగా ఏడేళ్లలోపు చిన్నారులు చేసే ఏ చర్యను నేరంగా పరిగణించకూడదనే నియమం ఉంది. దీంతో ఈ కేసు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ కేసులో న్యాయనిపుణుల సలహా ఆధారంగా ముందుకెళతామని పోలీసులు వెల్లడించారు.