తెలంగాణలో వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పైగా గెలుస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కేసీఆర్ దోపిడీ తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.
gidugu rudra raju said KCR has not done anything in telangana Congress victory is sure
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(gidugu rudra raju) అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏకంగా 70 సీట్లకుపైగా గెల్చుకుంటుందన్నారు. ఇటివల జరిగిన హైదరాబాద్ తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభనే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్లు చెప్పారు. దీంతోపాటు పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం పెరిగిందన్నారు. తాజాగా ఆయన కరీంనగర్లో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇటివల ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా వీటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్(KCR) పెద్దగా చేసిందేమి లేదని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని తప్పుదొవ పట్టిస్తున్నట్లు విమర్శించారు. తన కుటుంబం గురించి, వారి సంపాదన గురించి తప్ప ఆయనకు రాష్ట్ర పాలన మీద ధ్యాస లేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు ఏపీలో కూడా క్రమంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పారు.