ఏపీ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు నిస్సహాయక స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదన్నారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకుండానే జీపీఎస్ ను విత్ డ్రా చేసినట్లు వెల్లడించారు. తొంబై వేల మంది ఉద్యోగుల ఖాతా నుండి డబ్బులు తీసుకున్నారన్నారు. ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. అయినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అందుకే తాము గత్యంతరం లేక గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
తాము ఏదైనా నిరసన తెలుపుదామంటే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి గవర్నర్ కు వివరించినట్లు చెప్పారు. బడ్జెట్ పై కంట్రోల్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చేయాలని చూస్తున్నారన్నారు. ఉత్తమ యాజమానిగా నిలవాల్సిన ప్రభుత్వం దాని నుండి తప్పుకుంటోందన్నారు. ప్రభుత్వం తాను ఏర్పాటు చేసిన నిబంధనలను తానే ఉల్లంఘిస్తోందని చెప్పారు. ఏప్రిల్ నుండి రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తామని వెల్లడించారు. పోలీస్ కేసు పెడదామన్నా, ఏ పోలీస్ స్టేషన్ కేసును తీసుకోదన్నారు. గవర్నర్ కు అన్ని విషయాలు వెల్లడించామని చెప్పారు. ఆయన కొన్ని సందేహాలు వ్యక్తం చేశారన్నారు. అన్ని అంశాలు పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.