రాష్ట్రంలో ప్రసిద్దమైన ఖైరతాబాద్ (Khairatabad) గణేష్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. ఉదయం పది గంటలకు మహాగణపతికి తొలి పూజ నిర్వహించారు. పూజలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Dattatreya)తో పాటు తెలంగాణ మంత్రి తలసాని (Minister Talasani)శ్రీనివాస్ యాదవ్, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి నేతలు హారతిచ్చారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ ఏడాది 63 అడుగుల భారీ ఆకారంతో దశవిద్య మహాగణపతి(Mahaganapati)గా భక్తులకు దర్శనమిస్తున్నారు. గణపతికి కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ కమిటీ వెల్లడించింది. కాగా, ఖైరతాబాద్ లంబోదరుడి(Lambodara)ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ మొదలైంది. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వినాయక మండపం (Vinayaka Mandapam) పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.