పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్ది గంటల్లోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్‌ను దాటి హిమాచల్ ప్రదేశ్‌లోకి చేరుకున్న మరుసటి రోజే ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో, ప్రభుత్వంలో తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నేరవేర్చేందుకు తాను కృషి చేసినట్లు చెప్పారు. అవకాశం కల్పించి, తనపై చూపించిన గౌరవానికి థ్యాంక్స్ చెప్పారు.
కానీప్రస్తుతం ప్రస్తుతం పార్టీలో ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. అలాగే పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో పార్టీ వర్గాలతో నిండిపోయిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పని చేయలేనన్నారు. నరేంద్ర మోడీ హయాంలో దేశం ప్రపంచంలోనే దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించిందని ప్రసంసించారు. ఈ తొమ్మిదేళ్లలో దేశం బలంగా తయారైందన్నారు. పంజాబ్‌లోని సవాళ్లను బీజేపీ మాత్రమే ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు.
బాదల్ ఎంతో వివేకవంతుడని, అనుభవజ్ఞుడని పీయూష్ గోయల్ ప్రశంసించారు. పంజాబ్ ఆర్థికమంత్రిగా పని చేసినప్పుడు జాతీయ ప్రయోజనాలు లక్ష్యంగా మార్గనిర్దేశనం చేశారన్నారు. ఆయన పార్టీలో చేరడంతో సిక్కులతో తమ బంధం మరింత బలపడుతుందన్నారు. మన్‌ప్రీత్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీపై కమ్ముకున్న మేఘాలు తొలగిపోయాయని వ్యాఖ్యానించింది. అధికార దాహంతో బీజేపీలో చేరారని జైరాం రమేష్ మండిపడ్డారు.