టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కేశినేని శివనాథ్‌కు లోకసభ టిక్కెట్ ఇస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోను సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. అతనితో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చినా మద్దతు ఇచ్చేది లేదన్నారు. ఎవరైనా పార్టీలో పని చేయవచ్చు… పోటీ కూడా చేయవచ్చునని, కానీ క్రిమినల్స్, ల్యాండ్, సెక్స్ మాఫియా గ్రూప్‌లకు టిక్కెట్లు ఇస్తే సహకరించే ప్రసక్తి లేదన్నారు. టీడీపీ పూర్తిగా ప్రక్షాళన కావాలనే తన తాపత్రయమని, అందుకే ఈ విషయాన్ని చెబుతున్నట్లు వెల్లడించారు.
ఇక్కడ తన తమ్ముడికి కాకుండా సామాన్యుడికి టిక్కెట్ ఇచ్చిన సహకరిస్తానని తెలిపారు. ఆ రోజు ఎన్టీఆర్ మంచి ఆశయంతో పార్టీని స్థాపించారని, అయితే టిక్కెట్ ఇచ్చే విషయానికి వస్తే గాంధీకి ఇవ్వవచ్చు.. మాఫియా డాన్‌కు ఇవ్వవచ్చు.. పార్టీ స్టాండ్‌ను బట్టి ఉంటుందన్నారు. తాను నీతివంతమైన రాజకీయాలు చేస్తానని, అవినీతిపరులను తన వెనకాల వేసుకొని, తన కాంపౌండ్ చుట్టూ పెట్టుకోనని తెలిపారు. పార్టీని అమ్ముకునే వారికంటే నమ్ముకునే వారికి టిక్కెట్లు ఇవ్వాలని సూచించారు.
లోకసభ నియోజకవర్గంలో శివనాథ్ చురుగ్గా పని చేస్తున్నట్లు తెలిసిందని, అలా చేస్తే మంచిదేగా అన్నారు. కానీ తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు వచ్చిన వార్తలపై భిన్నంగా స్పందించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎవరు చెప్పారంటూనే, పార్టీ తన సేవలు ఎక్కడ అవసరమని భావిస్తుందో అక్కడ వాడుకుంటుందన్నారు. ఒకవేళ, తాను ఎంపీ కాలేకపోయినా టాటా ట్రస్ట్ వంటివి మరో వంద తీసుకువచ్చి ప్రజా సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.