తెలంగాణలో కొత్త సీఎస్ గా శాంతికుమారి విధుల్లో చేరడంతో.. ఈ పదవిలో ఉన్న సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. ఆయన గురువారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సోమేష్ కుమార్ విజయవాడకు వచ్చారు. తనను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆయన విజయవాడ చేరుకొని, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తదితరులను కలవనున్నారు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు వచ్చిన వ్యాఖ్యలపై సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తాను ఆంధ్రప్రదేశ్ సీఎస్‌ను కలిశాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. డీవోపీటీ ఆదేశాలను గౌరవిస్తూ ఏపీలో రిపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన తర్వాత తాను తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. తనను ఏపీకి కేటాయించినందున ఏపీ ప్రభుత్వం ఎలా చెబితే అలా చేస్తానని, అధికారిగా ఏ బాధ్యత అయినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు చిన్న పోస్ట్, పెద్ద పోస్ట్ అనే తేడా లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన నాటి నుండి ఆయన తెలంగాణలో ఉంటున్నారు. పదోన్నతులతో ముందుకు సాగుతూ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి వచ్చారు. అయితే విభజన సమయంలో ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లవలసి ఉంది. ఈ విషయం కాస్త కోర్టుకు చేరడంతో తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో ఆయన ఎట్టకేలకు ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ హయాంలో పని చేసిన ఆయన.. ఏపీలో విధుల్లో చేరకుండా.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే.. ఆ వాదనలకు సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తనకు వీఆర్ఎస్ తీసుకునే ఆలోచన లేదని.. కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నానని, ఏపీ సీఎస్‌ను కలిశాక మిగతా విషయాలు మాట్లాడుతానని చెప్పారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా సిద్ధమే అన్నారు. ఆయన మాటలను బట్టి ఏపీ ప్రభుత్వం ఇచ్చే బాధ్యతలను నిర్వర్తిస్తూనే, కొద్ది కాలంలోనే వీఆర్ఎస్ తీసుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, కాస్త సమయం తీసుకొని ఈ దిశగా అడుగు వేస్తారని అంటున్నారు. తెలంగాణలో మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వంలో పని చేస్తూ, ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి ఆయన ముందుకు అడుగు వేసే అవకాశాలు ఎక్కువ అంటున్నారు.