ప్రపంచ ఆర్చరీ (Archery) ఛాంపియన్ షిప్లో భారత్ తొలిసారి బంగారు పతకం సాధించింది. బెర్లిన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో భారత్‌కు చెందిన మహిళల కాంపౌండ్ జట్టు వెన్నం జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామి స్వర్ణ పతకాన్ని(Gold medal) గెలుచుకున్నారు. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్లో భారత్ గోల్డ్ మెడల్ సాధించడం ఇదే మొదటిసారి. ఫైనల్ పోరులో మెక్సికో(Mexico)కు చెందిన డఫ్నే క్విన్టెరో, అనా సోఫా హెర్నాండెజ్, అండ్రే బెసెర్రా త్రయాన్ని 235-229 తేడాతో ఓడించారు. క్వాలిఫయర్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచిన ఈ భారత్ బృందం.. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబియాను 220-216 తేడాతో ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
అంతకుముందు తొలి రౌండ్లో బై టీమ్‌గా ఎంపికైన భారత్ జట్టు, క్వార్టర్ ఫైనల్లో చైనాను, ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తైపీని ఓడించింది. కాగా జర్మనీలోని బెర్లిన్(Berlin)లో జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు మెక్సికన్ టీమ్‌పై 235-229తో గెలిచింది. డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెర్రాలపై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ(Jyoti Surekha)కు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఇది ఆరో పతకం కావడం విశేషం