ఒత్తైన జుట్టు కోసం ఓ మహిళ బ్యూటీపార్లర్‌ను ఆశ్రయించింది. తన సమస్యను పరిష్కరిస్తామన్న వారి మాటలు నమ్మి ఉన్న జుట్టు పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
A woman got bald on the advice of a beauty parlor in Hyderabad. Complained to the police
Beauty Parlor: కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లు.. ఒత్తైన జుట్టు కోసం ఓ మహిళా బ్యూటీ పార్లర్‌ను సంప్రదిస్తే ఉన్న జుట్టు పోయి బట్టతల వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad)లో చోటుచేసుకుంది. సాధారణంగా మగవారు అయినా ఆడవారు అయినా జుట్టు ఒత్తుగా(thick hair) ఉండాలని కోరుకుంటారు. అందులో వింతేమి లేదు. కానీ నేటి ఆహార పరిస్థితులు, కాలుష్యం దృష్ట్యా 20, 25 ఏళ్లకే మగవారిలో జుట్టు పలచ బడడం, నెరవడం సాధారణంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సమస్య మహిళల్లో కూడా ఎక్కువైంది. నగరంలోని జగదీశ్ మార్కెట్ సమీపంలో నివసించే ఓ మహిళ అందంగా కనిపించడానికి ఒత్తైన జుట్టు కోసం స్థానికంగా ఉన్న క్వీన్జ్ బ్యూటీ పార్లర్(Queen’s Beauty Parlour) అండ్ సెలూన్ వారిని సంప్రదించింది. ఇక వారు ఒత్తైన జుట్టు కోసం తమదైన ట్రీట్మెంట్ చేశారు. ముందు తన జుట్టు కత్తిరించి ఆపై ఏదో రసాయనం పూశారు. ఆ తరువాత మరో షాంపూ ఆమెకు ఇచ్చి ఇంటికెళ్లి తలస్నానం చేయమన్నారు. సంతోషంగా ఇంటికి వచ్చిన సదరు మహిళా స్నానం చేయడంతో జుట్టు మరింత ఊడిపోయింది.
దీంతో కంగారు పడిపోయిన మహిళ బ్యూటీపార్లర్ వారిని ఫోన్లో సంప్రదిస్తే ఊడిపోయిన వెంట్రుకల స్థానంలో కొత్తవి వస్తాయని ఆమెను నమ్మించారు. అలా ప్రతిరోజు వెంట్రుకలు రాలుతున్నాయి. వాటి స్థానంలో కొత్తవి వస్తాయి అని నమ్మింది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత మహిళ జుట్టు మొత్తం పలుచబడి బట్టతలగా తయారైంది. ఆందోళన చెందిన మహిళ మళ్లీ పార్లర్ వారికి విషయం చెప్పగా ఈసారి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళకు రకరకాల నూనెలు, షాంపూలు ఇచ్చి వాడమన్నారు. తాము చెప్పినట్టు చేస్తే ఒత్తైన జుట్టు వచ్చేస్తుందంటూ నమ్మించారు. వారు చెప్పినట్లు అన్ని చేసినా తన జుట్టు రాకపోగా మరింత పలుచగా తయారయింది. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పగా అతను కోపంతో ఊగిపోతూ భార్యను పుట్టింటికి పంపించేశాడు. దీంతో బ్యూటీ పార్లర్ వారు కూడా చేతులు ఎత్తేశారు. దీంతో చేసేది ఏమిలేక సదరు మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు అనుమతి తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.