అనుకున్నట్టే జరిగింది.. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్నే నిజం చేశాడు నిర్మాత దిల్ రాజు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి.. వారసుడు తెలుగు వెర్షన్ వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ముందుగా ఈ సినిమాను తెలుగు, తమిళ్లో ఒకేసారి రిలీజ్ చేయాలని.. జనవరి 11న డేట్ లాక్ చేశారు. కానీ తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్పుకున్నట్టు క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. పెద్దలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏది జరిగినా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని.. సినిమాపై నమ్మకంతో తాను వెనక్కి తగ్గినట్టు చెప్పారు. ఫైనల్గా జనవరి 14న వారసుడు సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. అయితే తమిళ్ వెర్షన్ మాత్రం జనవరి 11న రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు లైన్ క్లియర్ అయినట్టేనని చెప్పొచ్చు. అయితే బాలయ్య సినిమా జనవరి 12 వస్తోంది కాబట్టి.. రెండు రోజులు ఎక్కువ థియేటర్లలో ఉంటుంది. కానీ చిరు సినిమాకు మాత్రం ఒక్క రోజే థియేటర్ కౌంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తంగా వారసుడు వాయిదాతో వీరసింహారెడ్డికే లాభం ఎక్కువని చెప్పొచ్చు. అయితే తమిళ్లో వారిసు రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా.. తెలుగులో రిలీజ్ అవుతుందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే.. తమిళ్ వెర్షన్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.