ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్), బీజేపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరగడంతో… ఈ ఎన్నికను వాయిదా వేశారు. ఈ రోజుకు సభ వాయిదా పడిందని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రిసైడింగ్ ఆఫీసర్, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు.
ఈ ఎన్నికను ప్రతిష్ట్మాత్మకంగా తీసుకున్న ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు పెద్దఎత్తున రభస సృష్టించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించవలసిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా .. సత్య శర్మను ఆదేశించడంతో ఆప్ సభ్యులు తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. పైగా కో-ఆప్టెడ్ సభ్యుడు మనోజ్ కుమార్ ని ప్రమాణ స్వీకారం చేయాలని శర్మ ఆహ్వానించడంతో ఆప్ సభ్యులంతా కేకలు పెడుతూ పోడియం వైపు దూసుకుపోయారు. వారు టేబుల్స్ పైకి కూడా ఎక్కి నిరసన తెలిపారు.
దీంతో… బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలై.. అది కాస్త తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటల్లో అనేకమంది కిందపడిపోయారు. తమ సభ్యుడిపై దాడి జరిగిందంటూ గాయ పడిన తమ సహచరుని ఫోటోను ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. నామినేట్ అయిన సభ్యులు ఈ ఎంసీడీ హౌస్ లో ఓటు వేయడానికి వీలు లేదని ఆయన అన్నారు.
మేయర్ ఎన్నికలో గానీ, డిప్యూటీ మేయర్ ఎన్నికలోగానీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా ఓటు వేసే వీల్లేదని ఆయన చెప్పారు. అయితే రభసకు కారణం ఆప్ సభ్యులేనని, ఎన్నికలను ఎదుర్కోవడానికి వారికీ భయమెందుకని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. చివరకు ఈ రెండు పదవులకూ ఎన్నికను వాయిదా వేశారు.