ఆంధ్రప్రదేశ్ మళ్లీ మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందా?
తెలంగాణ విడిపోయాక ఆయా ప్రాంతాలు అభివృద్ధిని బలంగా కోరుకుంటున్నాయా?
హైదరాబాద్ వంటి సిటీ దూరం కావడంతో అందరి మనసు ప్రాంతాభివృద్ధి వైపు మరలిందా?
ఎవరు పరిపాలించినా ఒకే ప్రాంతంపై దృష్టి సారించి, తమ ప్రాంతాన్ని గాలికి వదిలేస్తున్నారనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడిందా?
అందుకే ఇటీవల ఎవరికి వారు తమకు రాష్ట్రం కావాలని కోరుతున్నారా?
అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ధర్మాన ప్రసాదరావు నుండి ప్రారంభిస్తే, ఉత్తరాంధ్ర పార్టీ అంటూ మరో రిటైర్డ్ అధికారి తెరపైకి రావడం, సీఎం కేసీఆర్ ఏపీలో పోటీ చేస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ ఇరిగేషన్‌పై తమకు స్పష్టత కావాలని సీమవాసుల విజ్ఞప్తి వంటి అంశాలు వారి ప్రాంతాభిమానం, తమ ప్రాంత అభివృద్ధిపై ఆలోచనకు కారణమని చెబుతున్నారు. తాజాగా, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.
సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి సురేష్ కుమార్ రాసిన వ్యాసాల సంకలనం ఆవిష్కరణ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏబీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రం మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కొద్ది రోజుల క్రితం మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్ర అంటూ పలికారు. చంద్రబాబు అమరావతిలో భూములన్ని కొనేసి, మరో హైదరాబాద్ చేయాలని చూశారని, దీనిని తాము అంగీకరించమని, అమరావతి మాత్రమే రాజధాని అయితే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను మరో రాష్ట్రంగా చేయాలన్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఉత్తరాంధ్ర రాష్ట్రం అజెండాగా జై ఉత్తరాంధ్ర పేరుతో సంక్రాంతి తర్వాత పార్టీని తీసుకువస్తామని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు అన్నారు. విభజన సమయంలోనే జేసీ దివాకర్ రెడ్డి తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీమ ప్రాంతం నుండి అనంతపురం వాసులు తెలంగాణతో కలవడానికి ఇష్టపడతారు. రెండూ వెనుకబడిన ప్రాంతాలేనని, ఈ రెండు ప్రాంతాలను నాటి పాలకులు విస్మరించారని చెబుతారు. ఉత్తరాంధ్ర పార్టీ అంటే, ఇప్పటికే తమను పట్టించుకోవడం లేదంటున్న రాయలసీమ ప్రాంతంలో ఉద్యమం పుట్టుకు వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ కారణంగానే ఏపీ మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించి ఉంటారని చెబుతున్నారు.