తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్లో పోలవరం పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ తదితరులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో తాము 175 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ఏపీలో ఎనిమిదేళ్ళయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని గుర్తు చేస్తూ, తాము తెలంగాణలో కాళేశ్వరాన్ని పూర్తి చేసినట్లుగా ఇక్కడ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన చూసి దేశం యావత్తు ఆయన ప్రధాని కావాలని కోరుకుంటోందన్నారు. కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని, త్వరలో జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారన్నారు. తెలంగాణ వంటి సంక్షేమ పథకాలు ఎక్కడా లేవన్నారు. ఇప్పటి వరకు పోలవరం పూర్తికాలేదని, ప్రత్యేక హోదా కూడా రాలేదన్నారు. 2024నాటికి దేశంలో విజయం సాధించి, కేసీఆర్ ప్రధానిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని తాను శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు.
కేసీఆర్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అంతకుముందే పక్క తెలుగు రాష్ట్రంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలువురు ఏపీ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డారు. సోమవారం పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కారెక్కేందుకు హైదరాబాద్ వచ్చిన రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఏపీలో తాము అధికారంలోకి వస్తే రాజధాని, సెక్రటరియేట్ నిర్మిస్తామన్నారు. తన తుది శ్వాస వరకు కేసీఆర్తో ఉంటానని, బీఆర్ఎస్తో కొనసాగుతానన్నారు.