ట్విట్టర్ (Twitter) యూజర్లు చూసే పోస్టుల సంఖ్యపై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. ట్వీట్టర్ అన్ వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకు 1000 ట్వీట్లు మాత్రమే అవకాశం కల్పించాలని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) నిర్ణయించారు. నూతనంగా ఖాతా తెరిచిన వారు రోజుకు కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూసే విధంగా పరిమితి విధించారు. డబ్బులు చెల్లించి ఖాతా(Account)ను వెరిఫై చేసుకున్న వారు రోజుకు 10 వేల పోస్టులు చూడొచ్చు. తొలుత వెరిఫైడ్ ఖాతాదారులకు (Verified Accounts) 6000, అన్ వెరిఫైడ్ వారికి 600, కొత్త ఖాతాదారులకు 300 పోస్టుల లిమిట్ పెట్టిన ఎలాన్ మస్క్ కొన్ని గంటల తర్వాత దాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ట్విటర్ నుంచి భారీ ఎత్తున డేటా చౌర్యం (Data theft) జరుగుతోందని, దాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మస్క్ తెలిపారు. ఈ నిబంధనలు తాత్కాలికంగా ఉంటాయని ఆయన అన్నారు. ట్విట్టర్ యూజర్లు ఇతరుల ట్వీట్లను చూడాలంటే అకౌంట్ లో తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వరకు లాగిన్ అవ్వకపోయనా.. వెబ్ బ్రౌజర్ (Web browser) ద్వారా ఇతర ఖాతాదారాల ట్వీట్లను చూసే అవకాశం ఉండేది. ట్విట్టర్ ఖాతా లేకపోయినా.. లింక్ ను బ్రౌజర్ లో ఓపెన్ చేసి చూసే వీలు ఉండేది. కానీ, ఈ సౌకర్యాన్ని ట్విట్టర్ నిలిపివేసింది. ఖాతాదారులు లాగిన్ అవుతునే ఇతరుల వివరాలు చూడొచ్చు. అకౌంట్ (Account) లేని వారు క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.