Kollywood: ఐదుగురు స్టార్ హీరోలకు నోటీసులు..శిక్ష తప్పదా?
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య వాదనలు జరుగుతున్నాయి. నటులు సినిమాల కోసం అడ్వాన్స్ లు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదని నిర్మాతలు రచ్చకెక్కారు. దీనిపై విచారణ జరగనుంది. ఇందులో నటులకు రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది.
తమిళనాడు(Tamilnadu)లో నటీనటులు, నిర్మాతలకు మధ్య వార్ నడుస్తోంది. ఈ రెండు వర్గాల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. హీరోలు అడ్వాన్స్ లు తీసుకుని షూటింగ్ లకు డేట్స్ ఇవ్వడం లేని నిర్మాతలు లబోదిబోమంటున్నారు. సరైన కథలు లేకుండా వస్తే డేట్లు ఎలా సర్దుబాటు చేయాలని హీరోలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యలో ఐదుగురు స్టార్ హీరోలకు తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. షూటింగ్‌కు సహకరించని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తేల్చి చెప్పింది.
తమిళ ఇండస్ట్రీలో ఎన్.రామసామి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నిర్మాతల మండలి ఇండస్ట్రీలోని హీరోలకు కొన్ని ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ప్రొడ్యూసర్స్‌కు సహకరించని ఐదుగురు నటులను గుర్తించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చలు జరిపింది. ఐదుగురు నటులు ప్రొడ్యూసర్ల నుంచి అడ్వాన్స్ లు తీసుకుని, డేట్స్ ఇవ్వడం లేదని నిర్మాతల మండలి ఫైర్ అయ్యింది. ఆయా నటులతో సినిమాలు చేయాలనుకుంటే నిర్మాతలు ముందు మండలి దృష్టికి తీసుకురావాలని తేల్చి చెప్పింది.
నిర్మాతలకు సహకరించని ఆ ఐదుగురు నటులకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకోవాలా? లేదా? అనే విషయాలను తెలియజేయనున్నట్లు నిర్మాతల మండలి తెలిపింది. ఈ విషయంపై కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఒకవేళ ఆ నటులు ఇచ్చే వివరణ ఆమోదయోగ్యంగా లేకపోతే రెడ్‌కార్డ్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఆ ఐదుగురు నటులు ఎవరనేది నిర్మాతల మండలి పేర్లను వెల్లడించలేదు. అయితే విశాల్, శింబు, యోగిబాబు, అధర్వ, ఎస్.జె.సూర్యనే అయ్యుంటారని కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.