ఈరోజు(జూన్ 18న) వెలువడిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ 2023 ఫలితాల్లో తెలంగాణ కుర్రాడు టాప్ లో నిలిచాడు. హైదరాబాద్ కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి(vavilala chidvilas reddy) అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఈ పరీక్షలో మొత్తం 360 మార్కులకు కాగా 341 మార్కులు సాధించారు. అయితే గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్లో అత్యధిక స్కోరు 314 మార్కులు కావడం విశేషం. ఇక మిగతా టాపర్లలో రమేష్ సూర్య తేజ 2వ ర్యాంక్ సాధించగా, రిషి కర్లా, రాఘవ్ గోయల్, అడ్డగడ వెంకట శివరామ్, ప్రభవ్ ఖండేల్వాల్, బిక్కిన అభినవ్ చౌదరి, మలయ్ కెడియా, నాగిరెడ్డి బాలాజీ రెడ్డి, యక్కంటి పాణి వెంకట మణీంధర్ రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అయితే మహిళా టాపర్ కూడా హైదరాబాద్(hyderabad)కు చెందిన నాయకంటి నాగ భవ్యశ్రీ 298 మార్కులతో 56వ ర్యాంకు సాధించడం విశేషం. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రెండు పేపర్లకు గాను మొత్తం 1,80,372 మంది అభ్యర్థులు హాజరు కాగా, 43,773 మంది అర్హత సాధించారు. ఈ సంవత్సరం పరీక్షలో 36,204 మంది పురుషులు, 7,509 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది హైదరాబాద్ జోన్(zone) నుంచి 10,432 అర్హత సాధించడం విశేషం. ఐఐటి ఢిల్లీ జోన్ నుంచి 9,290 మంది, ఐఐటీ బాంబే జోన్ నుంచి 7,957 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక జోన్ల వారీగా టాప్ 500 ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్- 17, ఢిల్లీ – 120, బాంబే – 100, రూర్కీ – 46, ఖరగ్పూర్ – 37, కాన్పూర్ – 16, గౌహతి – 4 మంది ఉన్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి ఆదివారం ఉదయం JEE అడ్వాన్స్డ్ 2023 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను jeeadv.ac.inలో IIT JEE నుంచి తనిఖీ చేయవచ్చు. ఆన్సర్ కీతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసింది. JEE అడ్వాన్స్డ్ 2023 పరీక్షను జాయింట్ అడ్మిషన్ బోర్డ్ 2023 (JAB) మార్గదర్శకత్వంలో ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ IITలు జూన్ 4, 2023న నిర్వహించాయి.