»Attack On Telangana Student In America With A Knife Minister Ktr Will Provide Help
Varun Raj: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తితో దాడి..సాయం అందిస్తామన్న మంత్రి కేటీఆర్
అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తి దాడి చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన వరుణ్ రాజ్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వరుణ్ చికిత్సకు సాయం చేస్తానని మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థిపై దాడి జరిగింది. కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. 24 ఏళ్ల తెలంగాణ విద్యార్థి వరుణ్ రాజ్ (Varun Raj)పై జిమ్‌లో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో వరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య వరుణ్ కొట్టుమిట్టాడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇండియానా (Indiana) రాష్ట్రంలోని వల్పారైసో అనే నగరంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.
కత్తితో దాడి చేసిన జోర్డాన్ అండ్రాడ్ (Jordan Androd)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాణాలు తీసే ఆయుధాన్ని కలిగి ఉండటంతో నిందితుడిపై హత్యాయత్నం కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫోర్ట్ వేన్ ఆస్పత్రిలో వరుణ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని, తీవ్రంగా గాయం కావాడంతో వరుణ్‌కు బతికే అవకాశాలు ఐదు శాతంలోపే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.
నిందితుడు జోర్డాన్ Jordan Androd) మాట్లాడుతూ..తాను ఉదయాన్నే మసాజ్ కోసం గదిలోకి వెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడన్నారు. ఆ వ్యక్తి కొంచెం అసహజంగా, ప్రమాదకరమైన వ్యక్తిగా కనిపించడంతో తాను దాడి చేసినట్లుగా పోలీసులకు వివరించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలులో ఉంచారు.
వరుణ్ రాజ్‌పై కత్తి దాడి జరగడంతో వల్పారైసో యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరుణ్ రాజ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారైల మద్దతుతో వరుణ్‌కు అవసరమైన సాయాన్ని అందిస్తానని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.