పవన్ కళ్యాణ్ (Pavan kalyan) ముందు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో నిర్ణయం తీసుకోవాలని ఏపీ మంత్రి సీదిరి (Minister Sidiri) అప్పలరాజు అన్నారు. ఇలా బిచ్చం అడిగినట్టు అడిగితే ముఖ్యమంత్రి పదవి లభిస్తుందా? అని అన్నారు. సీఎం పదవి అనేది ప్రజలు ఇవ్వాలని, అంతే తప్ప ముష్టి అడిగితే రాదని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం(Srikakulam)లో ఆయన మాట్లాడుతూ.. తాను అసెంబ్లీకి వెళ్లడానికి ఎవరు ఆపుతారంటూ పవన్ అంటున్నారని.. ఇంతకీ పవన్ తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు తిరుగుతున్నాడా? లేక తన ఎమ్మెల్యేల్ని గెలిపించేందుకా? అనే క్లారిటీ లేదని ఆయన ఆరోపించారు. చెప్పులు మర్చిపొతే తెచ్చుకోవచ్చు కానీ.. పార్టీ గుర్తు పోతే ఎలా? అని ప్రశ్నించారు.
ముందు మీ పార్టీ గుర్తు పోయిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పవన్‌ని సూచించారు. పార్టీ గుర్తు ఎక్కడుండో, ఎలక్షన్ కమీషన్ (Election Commission) ఎవరికి కేటాయించిందో తెలుసుకోవాలని చెప్పారు. పవన్ ముందు తన గుర్తు ఎక్కడుందో వెతుక్కోవాలన్నారు. తనని సీఎం చేయాలని కోరుతున్న పవన్.. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు? అని నిలదీశారు. సీఎం కావాలంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయాలని, కేవలం 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ముఖ్యమంత్రి కాలేరని పవన్‌కి కౌంటర్ ఇచ్చారు.గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో జనసేన(Janasena), టీడీపీ, బీజేపీ ఉమ్మడిగానే పనిచేశాయని, తెరవెనుక అంతా కలిసే సంసారం చేస్తున్నారని మంత్రి సీదిరి వెల్లడించారు