తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ స్థాపించిన తర్వాత ఏపీ విభాగాన్ని ప్రారంభించారు. ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్(Tota Chandrasekhar)ను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి రావెల కిషోర్(Ravela Kishore), చింతల పార్థసారధి కూడా బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్(BRS)ను ఏపీలో కూడా విస్తారిస్తామని చెప్పారు. తీరా చూస్తే ఏపీలో ఆ పార్టీ హడావిడే కనిపించడం లేదు. ఏపీ బీఆర్ఎస్లో నేతలున్నారా..? అసలు పార్టీ అయినా ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు కనిపించడం లేదు. ఆ పార్టీపై అక్కడి జనాలకే కాదు.. నేతలకు కూడా ఆసక్తి లేనట్లుంది.
బీఆర్ఎస్లో తోట చంద్రశేఖర్, రావెల వంటి నేతలు చేరిన తర్వాత ఒకట్రెండు ప్రెస్ మీట్లు (Press meets)పెట్టి హడావిడి చేశారు. ఆ తర్వాత నుంచి మళ్లీ కనిపించలేదు. ఇక ఈ ముగ్గురూ తప్ప పేరున్న నేతలెవరూ పార్టీలో చేరలేదు. బీఆర్ఎస్లో చాలా మంది నేతలు చేరుతారని అంతా భావించారు. కేసీఆర్ నాయకత్వం నచ్చి చాలా మంది తమ పార్టీలో చేరబోతున్నట్లు తోట చంద్రశేఖర్ తెలిపారు. కానీ, అదేమీ జరగలేదు. ఎవరూ పార్టీలో చేరలేదు. కొంతకాలంగా నేతలెవరూ యాక్టివ్(Active)గా లేరు. తోట చంద్రశేఖర్ మాత్రమే అప్పుడప్పుడూ కనిపిస్తుండగా, రావెల్, చింతల పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక వాళ్లు పార్టీకి దూరమైనట్లే అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు ఏపీలో మంచి ఆదరణ దక్కుతుందని కేసీఆర్ భావించారు. ఇతర పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు బీఆర్ఎస్లో చేరుతారని అనుకున్నారు.
కానీ, అది జరగలేదు. ఎవరూ బీఆర్ఎస్(BRS)ను పట్టించుకోవడం లేదు. చాలా కాలంగా ఏపీ కీలక నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. కానీ, ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అంతగా ప్రాధాన్యం లేని తోట చంద్రశేఖర్‌ను పార్టీలో చేర్చుకుని అధ్యక్షుడిని చేశారు. వేరే నేతలెవరూ రాలేదు. ఏపీ అనే కాదు.. మహారాష్ట్ర(Maharashtra)లో పార్టీ విస్తరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇటీవల మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన నేతలు కూడా పార్టీలో చేరారు. కానీ, ఎక్కడా ఆశించిన మైలేజ్ రావడం లేదు. ప్రస్తుత పరిణామాల్ని చూస్తుంటే తెలంగాణ (Telangana) మినహా ఎక్కడా బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండదన్నది స్పష్టమైంది. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న కేసీఆర్ ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి.