చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్‌లోను వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్‌లో మూడు నమోదయ్యాయి. ఇప్పటికే అక్టోబర్ నెలలో గుజరాత్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లో గుర్తించగా, తాజాగా మూడు కేసులు వెలుగు చూశాయి. గుజరాత్లో రెండు, ఒడిశాలో ఒకటి నమోదయింది. ఒమిక్రాన్ (బీఎఫ్ 5)కు సబ్ వేరియంట్ బీఎఫ్ 7. ఈ వేరియంట్‌కు బలమైన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంది. ఇంక్యుబేషన్ వ్యవధి తక్కువ. వ్యాక్సీన్ తీసుకున్న వారికి కూడా ఇన్పెక్షన్ కలిగించగలదు. చైనా, అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది.
చైనాలో ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ కారణంగా చైనాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదివరకు ఇన్ఫెక్షన్ రాకపోవడం, వ్యాక్సీన్ సమర్థత కారణంగా చైనా ప్రజల తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉండటం వంటి అంశాలు అధిక వ్యాప్తికి కారణమవుతున్నాయి. జూలై – అక్టోబర్ – నవంబర్ 2022 కాలంలో గుజరాత్ ఆరోగ్య శాఖ బీఎఫ్ 7తో పాటు బీఎఫ్ 12 వేరియంట్‌ను గుర్తించింది. విదేశాల నుండి వచ్చిన వారు ఈ వేరియంట్ బారిన పడ్డారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 28 శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తీసుకోవాలని పేర్కొంది. ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ లక్షణాల విషయానికి వస్తే ఒళ్లు నొప్పులు అధికంగా ఉండటం, జ్వరం, ముక్కు కారడం, ఎక్కువగా దగ్గు, గొంతు నొప్పి రావడం, వినికిడి సమస్య, ఛాతిలో నొప్పు, వణుకు రావడం ఉంటాయి. కేంద్రం కరోనా హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.