Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలోకి ఈ రోజు ప్రవేశించాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. లక్షద్వీప్, కేరళలో (kerala) నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో కేరళలో గత 24 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో కేరళలోని మిగతా ప్రాంతాలతోపాటు కర్ణాటక (karnataka), తమిళనాడు (tamilnadu) మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంది.
పశ్చిమ వైపు నుంచి భారీ వేగంతో గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ప్రవేశించిన తొలి వారంలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ (kerala) తీరాన్ని తాకాల్సి ఉండగా వాతావరణ మార్పులు, తుపాను కదలికల వల్ల వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. గతేడాది మే 29న రుతు పవనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 2021లో జూన్ 3వ తేదీన, 2020లో జూన్ 1వ తేదీన రుతు పవనాలు తీరాన్ని తాకాయి. ఈ సారి సముద్రంపై ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో సాగు భూమి నుంచి 40 శాతం దిగుబడి వస్తుంది.
కేరళ (kerala) తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకిన తర్వాత వారం రోజులకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 10వ తేదీ లోపు వర్షాలు కురవాల్సి ఉండగా.. అదీ 14, 15వ తేదీలకు మారింది. తొలకరి జల్లుల కోసం అన్నదాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాగు సన్నాహాక పనుల్లో నిమగ్నై ఉన్నారు.