సచిన్ టెండుల్కర్…. ఇది ఒక పేరు కాదు.. క్రికెట్ ప్రియులకు ఒక ఎమోషన్. క్రికెట్ అనగానే ముందుగా వినిపించే పేరు సచిన్. ఆయన తర్వాత… ఆయన కుమారుడు అర్జున్ కూడా అంతే గొప్ప క్రికెటర్ అవుతారని… ఆయన అభిమానులు ఎంతగానో ఆశించారు. అయితే… మరీ ఎక్కువగా పోల్చడం వల్లో.. సచిన్ కొడుకు అనే ఒత్తిడి కారణంగానో… అర్జున్ టెండుల్కర్ అభిమానులు ఆశించినంత పేరు మాత్రం సంపాదించుకోలేకపోయాడు. కానీ… ఇప్పుడు టర్న్ మారింది. మెల్ల మెల్లగా అర్జున్ ఫామ్ లోకి వస్తున్నాడు. తాజాగా.. రంజీ మ్యాచ్ లో అదరగొట్టాడు. తండ్రి తలపించేలా సెంచరీతో అదరగొట్టాడు. దీంతో… సచిన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండ్రికి తగ్గ కొడుకు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసలు మ్యాచ్ వివరాల్లోకి వెళితే… గోవా తరపున రంజీ మ్యాచ్ బరిలోకి దిగిన అర్జున్ టెండుల్కర్ తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జున్ సెంచరీతో మెరిశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండుల్కర్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికి గోవా 78.1 ఓవర్లలో 196 రన్స్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 పరుగులు చేసిన అర్జున్.. రెండో రోజు లంచ్ సమయానికి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సెంచరీ నమోదు చేశాడు. ప్రభుదేశాయ్‌తో కలిసి 200 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బుధవారం మధ్యాహ్నం 3.10 గంటల సమయానికి ప్రభుదేశాయ్ 352 బంతుల్లో 172 పరుగులతో క్రీజ్‌లో ఉండగా.. అర్జున్ టెండుల్కర్ 195 బంతుల్లో 112 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. దీంతో గోవా 140 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.
ఇదిలా ఉండగా… 1988 డిసెంబర్లో తొలి రంజీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండుల్కర్.. తొలి మ్యాచ్‌లోనే శతకం బాది సత్తా చాటాడు. 34 ఏళ్ల తర్వాత సచిన్ కుమారుడు అర్జున్ సైతం అదే తరహాలో ఆడిన రంజీ ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేయడం గమనార్హం.