కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు. ఈ రెపో రేటు పెరిగితే, బ్యాంకులు తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మీడియాకు వివరించారు. రెపో రేటును 0.35 పాయింట్లు శాతం లేదా 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 5.90 శాతంగా ఈ రేటు ఇప్పుడు 6.25 శాతానికి చేరుకుంటుంది. క్రితంసారి ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో రెపో రేటు ఆగస్ట్ 2018 గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు పెంపు వరుసగా 5వది. మే నెలలో 40, ఆ తర్వాత జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 190 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో మొత్తం 2.25 శాతం పెరిగింది.
ఆర్బీఐ వరుసగా ఐదోసారి రెపో రేటును పెంచిన నేపథ్యంలో బ్యాంకు నుండి రుణాలు తీసుకునే రుణగ్రహీతల కారు, హోమ్ లోన్ ఈఎంఐ పెరగనుంది. గత కొద్ది నెలలుగా పెరుగుతున్న రెపో రేటుతో ఇప్పటికే బ్యాంకులు వడ్డీ రేటునుపెంచాయి. తాజా పెంపుతో మరోసారి బ్యాంకుల వడ్డీ భారం మరింత పెరిగే అవకాశముంది.
ద్రవ్యోల్భణం విషయానికి వస్తే అక్టోబర్ నెలలో వరుసగా పదో నెల 6 శాతానికి పైగా ఉంది. ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. డిపాజిట్ దారులకు వడ్డీ పెరుగుతుంది. రుణాలు తీసుకునే వారికి మాత్రం వడ్డీ భారంగా మారుతుంది. కరోనా నేపథ్యంలో కేంద్ర బ్యాంకు రెపో రేటును భారీగా తగ్గిస్తూ వచ్చింది. మార్చి 2020 నుండి తగ్గిస్తూ వచ్చిన రెపో రేటును., ఆ తర్వాత కరోనా ప్రభావం తగ్గి, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి రెపో రేటును పెంచుతూ వస్తోంది.
కరోనా తర్వాత రష్యా – ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడిందని, ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని శక్తికాంతదాస్ అన్నారు. అయితే భారత కార్పోరేట్ గతంలో కంటే బలపడ్డాయని, భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉందన్నారు. ఆసియాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ముందు ఉన్నదన్నారు. FY23కి గాను ద్రవ్యోల్భణం అంచనాలను 6.7 వద్ద స్థిరంగా కొనసాగిస్తుండగా, FY23 జీడీపీ వృద్ధి రేటును 7 శాతం నుండి 6.8 శాతానికి తగ్గించారు.