ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు (Ordinance) వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల (Bureaucrats) బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన పోరాటాన్ని ఉధృతం చేశారు. మద్దతు కూడగట్టేందుకు వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఆయన ముంబైలో పర్యటిస్తూ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ నేతలను కలిసి, తనకు సంఘీభావం తెలపాలని కోరుతున్నారు. అంతకుముందు ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీతో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal) ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అతిషి, రాఘవ్ ఛద్దా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (CM Bhagwant Mann) కూడా పాల్గొన్నారు.
ముంబై(Mumbai)లోని యశ్వంత్రావ్ చవాన్ సెంటర్లో సమావేశం నిర్వహించారు .కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల బృందం శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)తో సమావేశమయ్యారు. ఉద్ధవ్ థాకరేతో సమావేశమైన తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్(Ordinance)ను జారీ చేయడాన్నిబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై నమ్మకం లేదని అర్థమవుతోందన్నారు. ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్లింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఓ ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో పోలీసు, ప్రజా భద్రత, భూములు మినహా మిగిలిన శాఖలపై నియంత్రణాధికారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల తీర్పు చెప్పింది. దీనిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసి, ఈ అధికారాలను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టింది.