బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi sunak), ఆయన భార్య అక్షత మూర్తి(Akshata murthy) ఏడాది కాలంలో రూ.2,069 కోట్లు నష్టపోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బ్రిటీష్ ప్రధాని పీఠం అలంకరించిన వారిలో అత్యంత సంపన్నుడుగా రిషి సునాక్ రికార్డు కెక్కాడు. ఆయన భార్య అక్షత మూర్తి పేరిట కూడా భారీగా షేర్లు ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట బ్రిటన్ కుబేరుల జాబితాలో 275వ స్థానంలో ఉందని సండే టైమ్స్ మీడియా సంస్థ కూడా తెలిపింది.
తాజాగా రిషి సునాక్(Rishi sunak), అక్షత మూర్తి(Akshata murthy) గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గత 12 నెలల వ్యవధిలో వీరి సంపద తరుగుతూ వస్తోందని సమాచారం. గతేడాది సునాక్, అక్షత దంపతుల ర్యాంకు 222 గా ఉండగా ఇప్పుడా ర్యాంకు మరింత పతనం అయినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ సంస్థలో రిషి సునాక్ దంపతుల వాటా విలువ తగ్గిపోవడంతో ఈ సంపద క్షీణత చోటుచేసుకుంది.
రిషి సునాక్(Rishi sunak) పెళ్లాడిన అక్షత మూర్తి(Akshata murthy) ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం, నష్టం మినహాయిస్తే రిషి సునాక్ నికర సంపద విలువ రూ.5,446 కోట్లు కాగా గతేడాది అది రూ.7,515 కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ ఒడిదుడుకుల కారణంగా ఆ సంపదలో భారీగా తగ్గినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.