మైనర్ బాలికకు పెళ్లి చేయకూడదని మన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే… ఓ 15ఏళ్ల మైనర్ బాలిక పెళ్లికి మాత్రం స్వయంగా కోర్టే అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆ బాలిక ముస్లిం కావడంతో… వారి మత ఆచారాల ప్రకారం…. చేయవచ్చని కోర్టు స్వయంగా పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన జార్ఖండ్ లో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ ముస్లిం యువకుడు తన మతానికే చెందిన 15 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడంటూ దాఖలైన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ ద్వివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. బిహార్‌లోని నవాడాకు చెందిన 24 ఏళ్ల మహ్మద్ సోను.. ఝార్ఖండ్‌లోని జుగ్ సలాయ్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నట్టు కేసు నమోదైంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సోనుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై కేసు నమోదుచేయడాన్ని సవాల్ చేస్తూ మహ్మద్ సోను ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు.
అయితే, పిటిషన్ విచారణ సందర్భంగా అమ్మాయి తండ్రి యూటర్న్ తీసుకున్నాడు. తాను ఈ వివాహాన్ని వ్యతిరేకించడంలేదని, తన కుమార్తెకు తగిన వ్యక్తిని కుదిర్చినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కోర్టుకు వెల్లడించాడు. కొంత అవగాహనలేమి కారణంగా సోనుపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని బాలిక కుటుంబం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలను విన్న అనంతరం.. ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ జస్టిస్ ద్వివేది ఆదేశాలు ఇచ్చారు. ముస్లిం అమ్మాయిల వివాహాలకు సంబంధించిన విషయాలు ముస్లిం పర్సనల్ లా బోర్డు పరిధిలోని వ్యవహారమని వ్యాఖ్యానించారు. దాని ప్రకారం 15 ఏళ్లు దాటిన అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని చెప్పడం గమనార్హం.