Strike from June 5 : జూన్ 5 నుంచి తెలంగాణ రేషన్ డీలర్ల సమ్మె
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనకు సమ్మె బాటపట్టే యోచనలో రేషన్ డీలర్లు ఉన్నారు. ఇప్పటికే తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏప్రిల్ నెలలోనే పౌరసరఫరాలశాఖ(Department of Civil Supplies) కమిషన్ అనిల్‌కు తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అందజేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్ల(Ration dealers)కు గౌరవ వేతనంపై జూన్ 4 లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. లేనిపక్షంలో 5 నుంచి రాష్ట్రంలోని 17వేల మంది డీలర్లు నిరవధిక సమ్మెలోకి దిగుతారని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్య వేదిక ప్రభుత్వన్ని హెచ్చరించింది.ప్రతి రేషన్ డీలర్‌కు రూ.30 వేల గౌరవ వేతనం, రూ.10 లక్షల బీమా సదుపాయం(Insurance facility), ఆరోగ్యకార్డు(health card)ల పంపిణీతో పాటు శాశ్వత ప్రాతిపదికన డీలర్‌షిప్‌లను కేటాయించాలని డిమాండ్ చేశారు. జూన్ 5 నాటికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగాలని నిర్ణయించారు.
నిబంధనల ప్రకారం 45రోజులు ముందుగానే కమిషనర్‌కు డిమాండ్ నోటీసు అందజేసినట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు (Nayakoti raju) తెలిపారు. హామీలు ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో సమ్మె చేయడం మినహా వేరే దారి లేదని ఆయన తేల్చి చెప్పారు. డీలర్ల సమ్మె నోటీసు నేపథ్యంలో ఈ నెల 22న రేషన్ డీలర్లతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ గంగుల కమలాకర్(Gangula Kamalakar) సమావేశం కానున్నారు. సమావేశంలో సానుకూల నిర్ణయాలు వెలువడకపోతే జూన్ 5 నుంచి సమ్మెకు దిగేందుకు రేషన్ డీలర్ల సంఘం ఏర్పాట్లు చేసుకుంటోంది. జూన్ 4 లోగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే వివిధ రూపాల్లో ఆందోళనలు, ఉద్యమాలు ఉధృతం చేస్తామని డీలర్లు హెచ్చరిస్తున్నారు. సమ్మె నిర్వహణకు వీలుగా డీలర్లు జేఏసీగా ఏర్పడ్డారు.