యోగా గురు బాబా రామ్ దేవ్…. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే ఆయన తాజాగా… మహిళలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
మహిళలు దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. మహిళల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మహారాష్ట్రలోని పతంజలి యోగపీఠం, ముంబైకి చెందిన మహిళల పతంజలి యోగ సమితి సంయుక్తంగా యోగ సైన్స్ అనే శిబిరాన్ని నిర్వహించింది.
ఈ శిభిరంలో ఆయన మహిళలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సమయాభావం వల్ల యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు వాటిని మార్చుకునే సమయం లభించలేదు. దీనిపై స్పందించిన రాందేవ్ బాబా.. ఇంటికెళ్లాక దుస్తులు మార్చుకోవచ్చని అంటూనే.. మహిళలు చీరలు, సల్వార్ సూట్లలో అందంగా ఉంటారని అన్నారు. అక్కడితో ఆగక.. తన కళ్లకైతే వారు అసలేం ధరించకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించి వివాదం రాజేశారు. అమృతా ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే ఎదుటే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాందేవ్ బాబా వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.