Village Bus Officers : TSRTC వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని టీఎస్ ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ (TSRTC) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు పల్లెల్లో బస్ ఆఫీసర్ల నియమించాలని నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరిస్తూ.. ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేసేందుకు విలేజ్ బస్ ఆఫీసర్ల (Village Bus Officers) వ్యవస్థకు రూప కల్పన చేసింది. బస్ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(RTC MD VC Sajjanar) ఆయన ఆదేశించారు. ఈ బస్ ఆఫీసర్ల వ్యవస్థ మే 1 తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మార్గదర్శకాల్లో తెలిపారు. గ్రామాల్లో నివసించే సంస్థ కండక్టర్లు(conductors), డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లు (Village Bus Officers) గా డిపో మేనేజర్లు నియమిస్తారు. నియామకాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకువచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు బస్ ఆఫీసర్‌గా ఉంటారు. చిన్నవైతే రెండు, మూడు గ్రామాలకు ఒకరిని నియమిస్తారు.
ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు వీల్లేదు. హైదరాబాద్ (Hyderabad) సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్ బస్ ఆఫీసర్లలాగే పనిచేస్తారు.ఈ విలేజ్ బస్ ఆఫీసర్లు గ్రామస్థులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ బస్ అధికారులు 15 రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు.తెలంగాణ (Telangana) వ్యాప్తంగా టీఎస్ ఆర్టీ 10వేల గ్రామాలకు బస్సులు నడిపిస్తున్నది. ఆయా ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో 2వేలకుపైగా వీలేజీ బస్ ఆఫీసర్ల నియమించాలని నిర్ణయించింది. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ఆదరిస్తున్నారని, ఈ విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థను వినియోగించుకుని ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి (RTC Chairman Bajireddy)ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.