»Telangana Bjp Group Politics Exposed In Front Of Parshottam Rupala At Bellampalli
కేంద్ర మంత్రి సాక్షిగా BJPలో గ్రూపు రాజకీయాలు బట్టబయలు
పదవుల పందేరం ఇవ్వకుండా.. పార్టీ నాయకత్వం తమపై దృష్టి సారించకపోవడంతో హేమాజీ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో వివేక్ వర్గంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన నియోజకవర్గంలో వివేక్ పెత్తనమేమిటని హేమాజీ ప్రశ్నిస్తున్నారు.
అధికారమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం దూకుడు పెంచుతుండగా.. స్థానిక నాయకత్వ వ్యవహార శైలి ఆ లక్ష్యానికి గొడ్డలి పెట్టుగా మారింది. రాష్ట్ర నాయకత్వంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, పార్టీ ఇన్ చార్జ్ లు, పార్టీ అగ్ర నాయకుల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోకి (Telangana) అడుగుపెట్టేందుకు పార్టీ పెద్దలు వెనకడుగు వేస్తున్నారు. అందుకే అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డాల (JP Nadda) పర్యటనలు పలుమార్లు రద్దయ్యాయి. కాగా మరోసారి బీజేపీలో గ్రూపు రాజకీయాలు కేంద్ర మంత్రి సాక్షిగా బట్టబయలయ్యాయి. ఈ సంఘటన బెల్లంపల్లిలో జరిగింది.
బెల్లంపల్లిలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల (Parshottam Rupala) పర్యటించారు. ఓ సమావేశం నిర్వహించగా పార్టీ స్థానిక నాయకత్వంలో విభేదాలు పొడచూపాయి. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ హేమాజీని (Hemaji) వేదికపైకి కేంద్ర మంత్రి ఆహ్వానించారు. అయితే అతడిని పిలువడంపై మాజీ వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy) వర్గం తప్పుబట్టింది. అతడి రాకను నిరసిస్తూ వివేక్ వర్గానికి చెందిన నాయకులు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ గొడవతో రంగంలోకి దిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ (Raghunath) బుజ్జగించారు. దీంతో కొంత మెత్తబడిన వివేక్ వర్గం నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రశాంతంగా జరిగినా పార్టీలో లుకలుకలు మాత్రం ఉన్నాయని స్పష్టమైంది.
బీఆర్ఎస్ (BRS Party) నుంచి బీజేపీలో చేరినప్పటి నుంచి మాజీ ఎంపీ వివేక్ దూకుడు పెరిగింది. పెద్దపల్లి జిల్లాలో (Peddapalli District) తన బలం చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బెల్లంపల్లి నియోజకవర్గంలో హేమాజీని వివేక్ వ్యతిరేకిస్తున్నాడు. వివేక్ వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యం తగ్గిపోయిందని హేమాజీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహంతో ఉన్నారు. పదవుల పందేరం ఇవ్వకుండా.. పార్టీ నాయకత్వం తమపై దృష్టి సారించకపోవడంతో హేమాజీ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో వివేక్ వర్గంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన నియోజకవర్గంలో వివేక్ పెత్తనమేమిటని హేమాజీ ప్రశ్నిస్తున్నారు. పార్టీ నాయకత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని హేమాజీ వర్గం హెచ్చరిస్తోంది.