దేశంలో ప్రధాని మోదీపై (Narendra Modi), ఏపీలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పాలనను విమర్శిస్తూ సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె. నారాయణ (K Narayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతున్నాయని విమర్శించారు. దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన కొనసాగుతోందని ఆరోపించారు. గాంధీని చంపిన గాండ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని తిరుపతిలో (Tirupati) శుక్రవారం ఓ సమావేశంలో పాల్గొన్న నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై (Rahul Gandhi) మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. దేశానికి సేవ చేసిన నెహ్రూ కుటుంబానికి (Nehru Family) అడుగడుగునా వేధింపులకు గురి చేస్తున్నారు. బీజేపీ పెంపుడు కుక్కలా సీబీఐ వ్యవహరిస్తోంది. న్యాయ వ్యవస్థ మీద మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ’ అని నారాయణ మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) అంశంపై ప్రస్తావిస్తూ.. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ను డంప్ కేంద్రంగా మోదీ మార్చుతున్నాడు. స్టీల్ ప్లాంట్ సీఎం జగన్ ఎందుకు ఆపడం లేదు. అదానీకి, మోదీకి నొప్పి తగలకుండా సీఎం జగన్ వ్యవహరిస్తున్నాడు’ అని ఏపీ సీఎం జగన్ పై నారాయణ విరుచుకుపడ్డారు.
‘విభజన చట్టాలు, హామీలను అమలు చేయించుకోలేని బలహీన స్థితితో జగన్ ఉన్నాడు. జగన్ రోబో (Robot) లాంటి వ్యక్తి.. ఎలాంటి భావోద్వేగాలు లేని వ్యక్తి. రాజన్న రాజ్యం అని అధికారంలోకి వచ్చాక.. దోపిడీ రాజ్యంలా పాలన సాగిస్తున్నాడు. పుంగనూరు జవాన్ లా జగన్ పాలన ఉంది. ఆస్తులు లేకపోతే సంతకం పెట్టి ఇవ్వాలి’ అని నారాయణ డిమాండ్ చేశారు. ‘జీతాలు ఇవ్వలేని దివాళా స్థాయిలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) వ్యాఖ్యలు దురదృష్టకరం. బాగా సంపాదించిన తిమింగళాలకు సజ్జల కాపాలాదారుడు. దోపిడీదారులకు సజ్జల అధికార ప్రతినిధి. సీఎం కేసీఆర్ కు ఉన్నంత ప్రేమ ఏపీలో జగన్ కు లేదు’ అని నారాయణ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.