తెలంగాణ వైద్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓ ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి… ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు ఆయన పట్టుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనికి సంబంధంచిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మంగళవారం ప్రగతి భవన్ లో మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు సీఎం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత డీహెచ్.. కేసీఆర్ కాళ్లపై పడ్డారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి.. ఇలా చేయడం ఏంటి అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసుల్ని కూడా కేసీఆర్ వర్చువల్‌గానే ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ ను కలిసిన శ్రీనివాసరావు.. పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాళ్లు మొక్కారు. కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా కూడా మరోసారి కాళ్ల మీద పడ్డారు.
వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్లు మొక్కడం చూసిన కొందరు అధికారులు అవాక్కవుతున్నారు. ఏదో ఆశించి శ్రీనివాస్ రావు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారని..అందుకే కాళ్లు మొక్కారనే ప్రచారం జరుగుతోంది.