నేటి ఐపీఎల్(IPL) మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) పరాజయం పాలైంది. ఇప్పటి వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచ్ లు ఆడితే అన్నింట్లోనూ విజయం దక్కలేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 23 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం (RCB Victory) సాధించింది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు 9 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో అపజయం పాలవ్వడంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో చివరికి చేరింది. ఈ ఐపీఎల్(IPL) సీజన్ లో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచులు ఆడిన ఆర్సీబీ రెండు విజయాలు, రెండు అపజయాలను సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్(DC)కు మొదటి నుంచి షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఓపెనర్ పృథ్వీషా, మిచెల్ మార్షల్ లు డక్ ఔట్ అయ్యారు. యశ్ దూల్ 1, అభిషేక్ పోరెల్ 5 పరుగులకే ఔట్ అయ్యారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం 19 పరుగులు చేయగలిగాడు. మనీశ్ పాండే 50 రన్స్ చేశాడు. జట్టు తీవ్ర ఒత్తిడికి గురైందని చెప్పాలి. మరో వైపు ఆర్సీబీ బౌలర్లలో విజయ్ కుమార్ 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, పార్నెల్, హసరంగా, హర్షల్ పటేల్ చెరో వికెట్లు తీశారు. ఆర్సీబీ(RCB) ఘన విజయం సాధించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సందడి చేశారు.