జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడంటూ.. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశాడు. పవన్ ఈరోజు ఇప్పటంలో ఈ రోజు పర్యటించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అభిమానుల ఇళ్లు కూల్చివేశారంటూ పవన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. కాగా… పవన్ చేసిన విమర్శలకు అంబటి కౌంటర్ ఇచ్చారు.
ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అతనికి ఎంత ఫ్రస్టేషన్ ఉందో అర్ధం అవుతుందన్నారు. ప్రభుత్వాలను కూల్చే అవకాశం, హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, పవన్ కళ్యాణ్ కూల్చేయటానికి ప్రభుత్వం అంటే ఏమైనా సినిమా సెట్టింగ్ అనుకుంటున్నారా?? అని ప్రశ్నించారు. 53 ఇళ్ళను కూల్చేశారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తవమన్న ఆయన రోడ్డు వైండింగ్ కోసం జనవరిలోనే మార్కింగ్ చేశారని, కానీ పవన్ కళ్యాణ్ సభ జరిగింది మార్చి నెలలో అని అన్నారు. రోడ్డుకు మరోవైపు గతంలోనే రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యాయని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేనట్లు ఉందన్నారు.
ఒక్క ఇల్లు కూడా పడగొట్ట లేదు…నేను సవాలు విసురుతున్నా, డ్రైన్ కట్టే క్రమంలో ఆక్రమణలను తొలగించారని అన్నారు. అసలు ఇక్కడే జరిగిందా?? ఎక్కడా జరగలేదా?? అని ప్రశ్నించిన ఆయన పవన్ కళ్యాణ్‌ను అంతమొందించటానికి 250 కోట్ల సుపారీ ఇచ్చారట, గుజరాత్‌కు చెందిన వాళ్ళకు 250 కోట్లు ఇవ్వటం ఎందుకని ప్రశ్నించారు. దానిలో సగం డబ్బులు పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు ..తోక ఆడించుకుంటూ వస్తాడని అంటూ విమర్శించారు. చంద్రబాబు పై ఓ రాయితో హత్య ప్రయత్నం అని డ్రామాలు ఆడుతున్నాడని, పవన్ కళ్యాణ్ డైలాగులు చూస్తే ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు.
కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదే ప్రయత్నం చేయకండన్న ఆయన పవన్ కళ్యాణ్ సైకో ఫ్యాన్స్‌కు నా సలహా ఇదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాదని, యువత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇప్పటం గ్రామంలో 50 లక్షలు ఇస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.