పులివెందులలో (Pulivendula) జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన పైన తెలుగు దేశం పార్టీ అధినేత (Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
వైయస్ జగన్ స్వస్థలం పులివెందులలో (Pulivendula) జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన పైన తెలుగు దేశం పార్టీ అధినేత (Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కాల్పుల ఘటన రాష్ట్రంలో గన్ కల్చర్‌కు నిదర్శనమన్నారు. తుపాకీ దుర్వినియోగం చేశాడన్న చరిత్ర కలిగిన వ్యక్తికి మళ్లీ గన్ లైసెన్స్ ఎందుకు రెన్యువల్ చేశారు? ఎవరు సహకరించారు? నేరస్థుల అరాచకాలకు ప్రభుత్వ పెద్దల మద్దతు ఉంటేనే ఇలాంటి ఘటనలు జరుగుతాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్పుల ఘటన పైన న్యాయ విచారణ చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక విలేకరిగా ఉన్న భరత్ కు ఎందుకు లైసెన్స్ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.
దిలీప్ భార్య కన్నీరుమున్నీరు
దిలీప్ తో తన పెళ్లయి రెండేళ్లవుతోందని, మా పెళ్లి కోసం భరత్ వద్ద అప్పు చేశామని, ఇందుకు గాను వడ్డీ కూడా చెల్లిస్తున్నామని మృతుడు దిలీప్ భార్య అన్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు తన భర్తకు ఫోన్ చేస్తే, వేరే వాళ్లు లిఫ్ట్ చేసి, భరత్ తన భర్తను కాల్చి చంపినట్లు చెప్పారని కన్నీరుమున్నీరు అయ్యారు. డబ్బు ఇవ్వకుంటే మనిషిని చంపేస్తారా అని ప్రశ్నించారు. భరత్ తరుణం అనే లోకల్ పత్రికలో రిపోర్టర్ గా పని చేస్తూ, ఎంపీ అవినాశ్ రెడ్డి కుటుంబానికి దగ్గరయ్యారు. భరత్ వద్ద దిలీప్ రెండేళ్ల క్రితం రూ.50 వేల అప్పు తీసుకున్నాడు. ఇందుకు ప్రతి నెల వడ్డీని చెల్లిస్తున్నాడు.
పులివెందులలో మంగళవారం పట్టపగలు నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే గొర్లె భరత్ కుమార్ అనే వ్యక్తి తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పులివెందులకు చెందిన చింతకుంట దిలీప్ అనే వ్యక్తి మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు చెప్పారు జిల్లా ఎస్పీ అన్బురాజన్. భరత్ వ్యక్తిగత కక్షతో దిలీప్, మహబూబ్ బాషాల పైన కాల్పులు జరిపాడని చెప్పారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఏడాదిగా వివాదం నడుస్తోందని, డబ్బులు అడగడానికి వెళ్లిన సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందన్నారు. దీంతో ఇంటికి వెళ్లి రివాల్వర్ తీసుకు వచ్చిన భరత్.. దిలీప్, మహబూబ్ ల పైన మూడుసార్లు కాల్పులు జరిపినట్లు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.
రివాల్వర్ ఎందుకు ఉంది?
వైయస్ వివేకానంద హత్య కేసులో ఏడాదిన్నర క్రితమే భరత్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ కు భరత్ బంధువు. వివేకా హత్యకు కొద్ది గంటల ముందు సునీల్ కు భరత్ మద్యం సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎర్ర గంగిరెడ్డిని గతంలో పోలీసులు అరెస్ట్ చేసి, వేముల పోలీస్ స్టేషన్ లో ఉంచిన సమయంలో అక్కడకు వెళ్లిన భరత్.. హత్యకు సంబంధించి పలు అంశాలను బహిరంగంగా ప్రస్తావించినట్లుగా వార్తలు వచ్చాయి.
తనకు ప్రాణ హానీ ఉందని మీడియా ఎదుట ప్రస్తావించడం, వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ బృందానికి లేఖ రాయడంతో ఆయనకు రివాల్వర్ మంజూరు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వేరేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.