ప్రజెంట్ ఉన్న స్టార్ డైరెక్టర్స్‌లలో పూరి జగన్నాథ్(puri jagannadh) స్టైలే వేరు. హిట్, ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాలు చేయడం తప్పా.. పూరికి మరోటి చాతకాదు. నష్టాలొచ్చినా భరిస్తాడు, కష్టాలొచ్చినా నవ్వుతునే ఉంటాడు.. హిట్ అయినా ఆటిట్యూడ్ చూపించడు.. అలాంటి పూరి ఇప్పుడు ఊహించని విధంగా ఫైర్ అయ్యాడు. పూరి మ్యూజింగ్స్ ద్వారా తన మనసులో మాటలను కుండ బద్దలు కొట్టేలా చెప్పే పూరి.. ఈ సారి అంతకు మించి అనేలా రియాక్ట్ అయ్యాడు. దీనంతటికి కారణం లైగర్ సినిమానే. లైగర్ ఫ్లాప్ అవడంతో పూరితో పాటు.. ఆ సినిమా కొన్న వారు కూడా నష్టపోయారు.
దాంతో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చేందుకు పూరి రెడీ అయినట్టు టాక్. కానీ ఇంకా ఇవ్వలేదు.. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ధర్నా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పూరి పేరుతో ఉన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది పూరి ఫోన్ కాల్ రికార్డింగ్ అని భావిస్తున్నప్పటికీ.. అలా మాత్రం అనిపించడం లేదు. కావాలనే పూరి వాయిస్ రికార్డు చేసి లీక్ చేసినట్టుంది. ఇందులో కూడా పూరి తనదైన స్టైల్లోనే ఫైర్ అయ్యాడు. పరువు పోతుందని డబ్బులు వెనక్కు ఇవ్వాలనుకున్న పూరి.. ఇక ధర్నా చేసి పరువు తీస్తే.. ఇవ్వడం ఎందుకనే విధంగా మాట్లాడారు.
ఫైనల్‌గా ధర్నా చేసుకుంటే చేసుకోమని, అలా చేసిన వారికి తప్ప.. మిగిలిన వారికే డబ్బులు ఇస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే.. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నామని.. ఇండస్ట్రీ గురించి ప్రస్థావించాడు. బూతు పదాలు కూడా వాడాడు. అంటే పూరికి ఎంతలా మండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా.. అనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే పూరి ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అంటున్నారు. ఏదేమైనా మరోసారి పూరి హాట్ టాపిక్‌గా మారాడని చెప్పొచ్చు.